రాజస్థాన్ కోటాలో మరో విద్యార్ధిని ఆత్మహత్యకు పాల్పడింది. ఎంట్రన్స్ ఎగ్జామ్ జేఈఈకు ప్రిపేర్ కావడానికి కోటాకు వెళ్లిన 18 ఏళ్ల బాలిక ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. మృతి చెందిన బాలికను బోర్ఖెడాకు చెందిన విద్యార్ధినిగా పోలీసులు గుర్తించారు.
రాజస్థాన్‌లోని కోటాలో జేఈఈ, మెయిన్స్ ఎంట్రన్స్ పరీక్షకు కోచింగ్ తీసుకుంటున్న విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. ఈ ఏడాది ప్రారంభమైన నెల రోజుల్లో ఇప్పటికి ఇద్దరు విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. కోటలోని బోర్ఖెడాకు చెందిన 18 ఏళ్ల బాలిక తన నివాసంలో ఉరివేసుకుని మరణించిందని పోలీసులు తెలిపారు. ఘటనను గమనించిన కుటుంబసభ్యులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో ఆమె మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాలిక మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. విద్యార్థిని నివాసం నుంచి పోలీసులు సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు.
“మమ్మీ పాపా, నేను జేఈఈ చేయలేను. అందుకే ఆత్మహత్య చేసుకున్నాను. నేను ఓడిపోయాను. నేను చెత్త కూతురు. క్షమించండి మమ్మీ, నాన్న. ఇదే నాకు ఉన్న చివరి ఆప్షన్' అని సూసైడ్ నోట్ రాసింది.మృతురాలు పోటీ పరీక్షల కారణంగా బాలిక తీవ్ర ఒత్తిడికి గురవుతోందని పోలీసులు తెలిపారు. రోజు ఏడు గంటలు చదువుతున్నా చాలా ఒత్తిడికి లోనైందని పోలీసులు తెలిపారు.
ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్‌కు చెందిన మహ్మద్ జైద్ అనే 18 ఏళ్ల విద్యార్థి కోటలోని హాస్టల్‌లో ఉంటూ నీట్ పరీక్ష కోసం సిద్ధమవుతున్నాడు. అయితే జనవరి 23న అర్థరాత్రి తన గదిలో ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఇది చూసిన తోటి విద్యార్థులు షాక్‌కు గురయ్యారు. సమాచారం మేరకు పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. కుటుంబ సభ్యులకు సమాచారం అందించి.. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు
గతేడాది 29 మంది ఆత్మహత్య
ఇదిలాఉండగా.. రాజస్థాన్‌లోని కోటా కోచింగ్ సెంటర్లకు హబ్. వివిధ రాష్ట్రాలకు చెందిన ఎంతోమంది విద్యార్థులు పలు పోటీ పరీక్షల కోసం కోచింగ్ తీసుకునేందుకు ఇక్కడికి వస్తారు. అయితే 2023లో కోటాలో మొత్తం 29 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు. కోచింగ్ సెంటర్‌లో అధిక ఒత్తిడి వల్ల.. కొందరు విద్యార్థులు మానసికంగా కుంగిపోతున్నారు. అందుకే ఇలాంటి దుర్ఘటనలు తరచూ చోటు చేసుకుంటున్నాయి. విద్యార్థులపై ఒత్తిడి తగ్గించేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. అయినా కూడా ఆత్మహత్యలు తగ్గకపోవడం ఆందోళన కలిగిస్తోంది.
